Thursday, March 12, 2009

సడి సేయకో గాలి సడి సేయబోకే




సడి సేయకో గాలి సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడి సేయకే

రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటము లేని మహారాజు గాకేమి
చిలిపి పరుగుల మాని కొలిచిపోరాదే
సడి సేయకే

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే
సడి సేయకే

పండు వెన్నెలనడిగి పాన్పు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవన బూని విసిరిపోరాదే

సడి సేయకో గాలి సడిసేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిసేయకో గాలి

***

చిత్రం: రాజ మకుటం (1961)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: P లీల

No comments: